కోలీవుడ్ హీరో ఆర్య నటించిన కొత్త సినిమా ‘కెప్టెన్’. ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. శక్తి సౌందర్‌రాజన్ దర్శకత్వం వహించారు. ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ ఈ నెల 8న తెలుగులో విడుదల చేస్తున్నది. తాజా ఇంటర్వ్యూలో హీరో ఆర్య చిత్ర విశేషాలను తెలిపారు.
కొన్ని నెలల క్రితం ఒక క్రియేచర్ ప్రధాన పాత్రగా సాగే కథను దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ నాకు వినిపించారు. ఆయన నాకు మంచి మిత్రుడు. మేమిద్దరం గతంలో ‘టెడ్డి’ అనే చిత్రానికి పనిచేశాం. ఈ తరహా కథలను అతను బాగా డీల్ చేయగలడు. మరో దర్శకుడు ఈ కథ చెప్పి ఉంటే అంగీకరించి ఉండేవాడిని కాదు. కానీ శక్తి సౌందర్ రాజన్‌కు గ్రాఫిక్స్, ఇతర సాంకేతిక అంశాల మీద పట్టు ఉంది. అతని మీద నమ్మకంతో సినిమా చేశా. హాలీవుడ్లో వచ్చిన ‘ప్రిడేటర్’ తరహా కథ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఒక క్రియేచర్ వరకే ఆ పోలిక ఉంటుంది కానీ మిగతా అంతా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమానే రూపొందించాం.
అదే పెద్ద సవాలు..
ఒక సైనిక బృందానికి నేను కెప్టెన్‌గా ఉంటాను. మేమంతా మనకు ఇప్పటిదాకా చూడని ఒక జీవితో పోరాడాల్సి వస్తుంది. ఆ వింతజీవి ఏంటి? ఎందుకు దాడికి సిద్ధమైంది? దాన్ని మేమెలా ఎదుర్కొన్నాం? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలో ఆ వింత జీవిది కీలక పాత్ర. ఆ జీవి ఎలా ఉండాలి, ఎంత హైట్ ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది అనేది గ్రాఫిక్స్ ద్వారా డిజైన్ చేశాం. ఈ ఊహకు తగినట్లు మేము నటించాలి. అక్కడ ఒక క్రియేచర్ ఉంది అని అనుకుంటూ దానికి తగినట్లు సీన్స్ చేశాం. లేని క్యారెక్టర్‌ను ఊహించుకుని నటించడం పెద్ద సవాలుగా అనిపించింది. సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి తదితరుల పాత్రలు కీలకంగా ఉంటాయి.
తెలుగు సినిమాలంటే ఇష్టం
మాది కేరళ. నాకు గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీ తమిళం. తెలుగులోనూ ‘రాజా రాణి’ వంటి నా సినిమాలకు మంచి పేరొచ్చింది. నేరుగా తెలుగు సినిమా చేయాలని ఉంది. మంచి ప్రాజెక్ట్ కుదరాలి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడ బాగుందని టాక్ వస్తే పాన్ ఇండియా రిలీజ్ చేస్తాం. పాండమిక్ తర్వాత ఓటీటీల ప్రభావం పెరిగింది. థియేటర్ అనుభవాన్ని పంచే చిత్రాలను రూపొందిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.