My Baby |కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు అయినా.. డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. తమిళంలో సూపర్‌హిట్ అయిన డీఎన్ఏ మూవీ.. తెలుగులో మై బేబీ టైటిల్‌తో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది.
అథర్వ, నిమిషా సాజయన్ హీరోహీరోయిన్లుగా నెల్సన్ వెంకటేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన మై బేబీ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదలైంది. రిలీజ్‌తోనే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.35 లక్షలను వసూలు చేసి, ఇటీవల విడుదలైన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. కాగా, ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ సినిమాకు సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
కాగా, కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్.కె. పిక్చర్స్, ఏ మాత్రం తన బ్రాండ్ ఇమేజ్ను తగ్గించుకోలేదు అని మళ్లీ నిరూపించుకుందని సురేశ్ కొండేటి తెలిపారు. ఒక మంచి కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే విషయం మరోసారి రుజువైందని అన్నారు. ఇంతటి గొప్ప విజయం ఇచ్చినందుకు, మళ్లీ మా ప్రయాణాన్ని ప్రారంభించే భరోసా కలిగించినందుకు తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.
సినిమా కథేంటంటే..
ఈ చిత్రం ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా సజయన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ తన ఫస్ట్ లవ్ ఫెయిల్ అవ్వడం వలన మందుకి బానిసగా మారతాడు. మరోవైపు దివ్య బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరిద్దరికి అనుకోకుండా పెళ్లి జరుగుతుంది. అయితే ఆనంద్ దివ్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెను ప్రేమిస్తాడు. వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు.
ఈ క్రమంలోనే దివ్య గర్భవతి అవుతుంది, వారికి ఒక బాబు పుడతాడు. అయితే బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాలకే, ఆ బిడ్డ తమది కాదని, ఎవరో ఆసుపత్రిలో మార్చేశారని దివ్య పదేపదే చెబుతుంది. ఆమె మానసిక స్థితి కారణంగా మొదట ఎవరూ ఆమె మాటలు నమ్మరు. కానీ ఆనంద్ తన భార్య మాటలను నమ్మి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఆనంద్ తన బిడ్డను కనుగొనడానికి వెళ్లిన క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే ఒక పెద్ద నెట్‌వర్క్‌ను కనుగొంటాడు. అయితే ఈ నెట్వర్క్ని నడిపిస్తుంది ఎవరు. ఆనంద్ ఈ నెట్వర్క్ని ఎలా కనిపెట్టాడు. దివ్య తనకి పుట్టిన బిడ్డని మార్చేశారు అని ఎలా తెలుసుకుంటుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.