తమిళ అగ్రహీరోల్లో ఒకరైన ధనుష్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘సార్’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు, తమిళ భాషల్లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాయకానాయికలు ధనుష్, సంయుక్త మీనన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. సురేష్ చుక్కపల్లి, కె.ఎల్.నారాయణ కెమెరా స్విఛాన్ చేశారు. ఎస్.రాధాకృష్ణ స్క్రిప్ట్‌ను అందజేశారు. “యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఏ కామన్‌మ్యాన్’ స్లోగన్‌తో ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. వాణిజ్య పంథాలో తెరకెక్కబోతున్న సందేశాత్మక చిత్రమిదని చెబుతున్నారు. ఈ నెల 5 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్, తనికెళ్ల భరణి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌కృష్ణన్, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, ఎడిటర్: నవీన్నూలి, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: వెంకీ అట్లూరి.