Delhi Ganesh | ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (Delhi Ganesh) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో శనివారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కిపైగా సినిమాల్లో నటించారు. చివరగా ఆయన కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో కనిపించారు. అంతకుముందు తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు, తదితర సినిమాల్లో నిటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1944, ఆగస్ట్ 1న తమిళనాడులోని తిరునెల్వెలిలొ ఢిల్లీ గణేశ్ జన్మించారు. ఆయన అసలు పేరు గణేశన్. 1976లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కే.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యారు. 1981లో ‘ఎంగమ్మ మహారాణి’ చిత్రంలో హీరోగా నటించారు. 1964 నుంచి 1974 వరకు భారత వైమానిక దళంలో పనిచేశారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో దక్షిణ భారత నాటక సభ (DBNS) థియేటర్ గ్రూప్ సభ్యుడిగా పనిచేశారు. గణేశన్‌ను నటుడిగా పరిచయం చేసిన కె.బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేశ్‌గా నామకరణం చేశారు. 1979లో తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతులమీదుగా కలైమామణి పురస్కారాన్ని అందుకున్నారు.