Tamannah | నటి తమన్నా భాటియా వరుసగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విభిన్నమైన పాత్రలతో జోరు మీద ఉన్నారు. ఇటీవల ఓదెలా 2లో శక్తివంతమైన పాత్రతో, అలాగే అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2లో ఆకట్టుకునే రోల్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆమెకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చినట్టు చిత్ర పరిశ్రమలో టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ..వీ. శాంతారాం జీవితకథ ఆధారంగా బయోపిక్ రూపొందించనుండగా, అందులో తమన్నా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అందులో ఆమె, శాంతారం భార్య అయిన ప్రముఖ నటి సాంధ్య పాత్రను పోషించనున్నట్లు చెప్పుకుంటున్నారు.
హిందీ, మరాఠీ సినిమాల్లో సాంధ్య ఓ ప్రముఖ నటి. వీ. శాంతారాం దర్శకత్వంలో ఆమె నటించిన అనేక చిత్రాలు అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అందువల్ల సాంధ్య పాత్ర ఈ బయోపిక్‌లో అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నారు. ఈ బయోపిక్కు “చిత్రపతి వీ. శాంతారాం” అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది వీ. శాంతారాం పాత్రలో నటించనున్నాడు. ఆయన కెరీర్లో ఇది భిన్నమైన, ప్రతిష్టాత్మక పాత్ర అవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ చిత్రాన్ని ‘నాటసామ్రాట్’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే తెరకెక్కిస్తున్నారు. భావోద్వేగాలు, పాత్రల లోతును చూపడంలో ఆయనకు ఉన్న నైపుణ్యం దృష్ట్యా ఈ సినిమా కూడా ప్రత్యేకంగా నిలవొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కథ విన్న వెంటనే తమన్నా ఈ పాత్రపై ఆసక్తి చూపి అంగీకరించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పాత్రలు ఎంపికకి కొత్త ప్రాధాన్యం ఇస్తున్న ఆమెకి, ఈ పాత్ర మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని సమాచారం. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. వీ. శాంతారాం సినీరంగానికి చేసిన సేవలు, ఆయన వినూత్న ప్రయోగాలు, వ్యక్తిగత జీవితం ఇలా ఎన్నో అంశాలను ఈ బయోపిక్‌లో చూపించనున్నారు.ఈ చిత్రం బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌గా నిలుస్తుందని, అలాగే తమన్నా నటనకు కొత్త మైలురాయి అవుతుందని అభిమానులు, ఫిల్మ్ సర్కిల్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.