అగ్ర కథానాయికలు ఐటెంసాంగ్స్లో నర్తించే ట్రెండ్ చాలా కాలం క్రితమై మొదలై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నాయికలు ప్రత్యేకగీతాల్లో మెరిశారు. వారిలో మిల్కీబ్యూటీ తమన్నా ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ భామ చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. జైలర్లో ‘కావాలయ్యా’, హిందీ ‘స్త్రీ-2’ చిత్రంలో ‘ఆజ్ కీ రాత్..’ ఐటెంసాంగ్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా ఈ భామ మరోమారు స్పెషల్సాంగ్కు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’లో తమన్నా ప్రత్యేకగీతంలో ఆడిపాడనుందని సమాచారం. ఇందుకోసం సంగీత దర్శకుడు తమన్ హుషారైన బీట్తో ట్యూన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ‘ది రాజాసాబ్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం తమన్నా హిందీలో మూడు చిత్రాల్లో నటిస్తున్నది. ఈ ఏడాది తెలుగులో ఆమె ‘ఓదెల-2’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.