మూడుపదులు దాటిన కథానాయికలకు ‘మీ పెళ్లెప్పుడు’ అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంటుంది. పంజాబీ సోయగం తాప్సీకి కూడా అదే ప్రశ్న వేస్తున్నారట. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించే అడుగుతున్నారని చెప్పింది తాప్సీ. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాతిస్బోయేతో గత కొంతకాలంగా ప్రేమాయణాన్ని నడుపుతోందీ భామ. అయితే ఇటీవలకాలంలో ఈ జంటకు సంబంధించిన వార్తలేవీ బయటకు రావడం లేదు. తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వివరణ ఇచ్చింది తాప్సీ. ఆమె మాట్లాడుతూ ‘ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాల్లో గోప్యత పాటించడం నాకు ఇష్టం ఉండదు. నేను పెళ్లాడబోయే వ్యక్తి తప్పకుండా మా అమ్మనాన్నకు నచ్చాలి. కుటుంబ పెద్దల అంగీకారంతోనే వివాహబంధంలోకి అడుగుపెడతా. నేను పెళ్లి చేసుకొని జీవితంలో హాయిగా సెటిలైపోవాలని నా పేరెంట్స్ బలంగా కోరుకుంటున్నారు’ అని చెప్పింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని, భవిష్యత్తులో తప్పకుండా పెళ్లి కబురు చెబుతానని తాప్సీ పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆరు సినిమాల్లో నటిస్తోంది.