అగ్ర కథానాయిక తాప్సీ తన వైవాహిక జీవితం గురించి ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. గతకొంతకాలంగా మీడియాకు కాస్త దూరంగా ఉంటూ సినిమాల మీదనే దృష్టి పెడుతున్నదీ భామ. 2023లో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విరామ సమయాల్లో తన అత్తామామలను కలిసేందుకు డెన్మార్క్ వెళ్లివస్తుంటుంది తాప్సీ. ఈ నేపథ్యంలో ఆమె డెన్మార్క్‌కు మకాం మార్చిందని, కేవలం షూటింగ్ సమయాల్లోనే ముంబయికి వస్తున్నదని కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలొచ్చాయి.
వీటిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది తాప్సీ. తాను డెన్మార్క్‌కు షిప్ట్ అయినట్లు ఓ ఆంగ్లపత్రిక రాసిన వార్తను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ సెటైరికల్‌గా రియాక్ట్ అయింది. ‘ఈ పత్రిక వారికి ఇంతకు మించిన సెన్సేషనల్ వార్త దొరకలేదు కావొచ్చు. ఏదైనా వార్త రాసేముందు కొంచెం పరిశోధన చేయండి. మీకో విషయం చెప్పాలి… ముంబయిలోని ఈ చల్లటి వాతావరణంలో దోశ తింటూ నేను ఈ వార్తను చదువుతున్నా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం తాప్సీ హిందీలో గాంధారి, ఓ లడ్కీ హై
కహాన్ చిత్రాల్లో నటిస్తున్నది.