Taapsee Pannu | ‘నోటి దురుసు వీపుకు చేటు’ అని పెద్దలు ఊరకే అనలేదు. పాపం తాప్సీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. పక్కవాళ్ల జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడి, లేని ఇక్కట్లను కొని తెచ్చుకుంది తాప్సీ. వివరాల్లోకెళ్తే.. ఆమె పెళ్లి గురించి గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథిస్ బోతో ఆమె చాలారోజులుగా డేటింగ్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రపంచానికి తెలియజేసింది కూడా. ఇదిలావుంటే.. కొన్నిరోజుల క్రితం ఓ ప్రైవేటు ఫంక్షన్లో తాప్సీని చూసిన అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నలు సంధించారు. దానికి ‘ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లీ..?!’ అంటూ వెటకారంగా స్పందించింది. ఈ వెటకారం వెనుక మర్మం లేకపోలేదు. అలియాభట్ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తర్వాతే వివాహం చేసుకుంది.
నటి ఇలియానా కూడా సేమ్టుసేమ్. వారి వ్యక్తిగత జీవితాలపై పరోక్షంగా సైటైర్ వేస్తూ తాప్సీ ఇచ్చిన సమాధానమది. ఆ సమాధానమే ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది తాప్సీకి. ఈ నెల 13న తాప్సీ, మాథిస్బో పెళ్లి చేసుకుంటున్నారనే వార్త సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో తాప్సీ ఆ వార్తను ఖండించింది. ‘నా వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వను. ఈ గాలివార్తలు ఇక ఆపండి’ అంటూ తన వ్యక్తిగత సోషల్మీడియాలో స్పందించింది తాప్సీ. అక్కడ్నుంచే ఈ అందాలభామకు తిప్పలు మొదలయ్యాయి. తను గతంలో ఇచ్చిన సమాధానాన్ని గుర్తుచేస్తూ.. ‘ఇంకా గర్భం దాల్చలేదా?..’ అని ఒకరు.. ‘ఇంతకీ గర్భం ఎప్పుడు దాలుస్తావ్?..’ అని మరొకడు ఇలా సెటైర్లమీద సెటైర్లు. ఆమె జోక్ ఆమెకే రివర్స్ తగలడంతో పాపం తాప్సీ మౌనాన్ని ఆశ్రయించింది. నోటి దురుసు వీపుకు చేటు అని ఊరకే అన్నారా..