Taapsee Pannu | భారతీయ సినిమాలలో మహిళలను వస్తువులుగా చూపించడంపై నటి తాప్సీ పన్ను కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం దర్శక-నిర్మాతలు మాత్రమే కాకుండా, ప్రేక్షకులు కూడా ఈ ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ‘పెద్ది’, ‘టాక్సిక్’ వంటి చిత్రాలపై వస్తున్న విమర్శల నేపథ్యంలో తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. ప్రేక్షకులు కోరుకుంటున్నదే మేము ఇస్తున్నాము అనే వాదనను చిత్ర పరిశ్రమ తరచుగా తెరపైకి తెస్తుందని చెప్పారు. జనాలు ఏది కోరుకుంటే అది ఇవ్వకపోతే డబ్బులు ఎలా వస్తాయని మేకర్స్ భావిస్తారని, ఈ ఆలోచనా విధానం వల్ల అసలు కళ, నైపుణ్యం వెనుకబడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నటులు, దర్శకులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేరని, సోషల్ మీడియాలో ప్రేక్షకులు వ్యవహరించే తీరు ఈ సంస్కృతి కొనసాగడానికి కారణమవుతోందని ఆమె విమర్శించారు.
సినిమాల్లోని కొన్ని సన్నివేశాలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, కొందరు మాత్రం ఆ చిత్రాలలోని ఫోటోలను జూమ్ చేయడం, వీడియోలలో విచిత్రమైన కోణాలను ఉపయోగించి వైరల్ చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారని తాప్సీ గుర్తుచేశారు. దీనివల్ల సోషల్ మీడియాలో అలాంటి కంటెంట్‌కు ఆదరణ ఉందని మేకర్స్‌కు సంకేతాలు వెళ్తున్నాయని చెప్పారు. కోవిడ్ మహమ్మారికి ముందు భారతీయ సినిమా మంచి పురోగతిని సాధించి ప్రపంచ స్థాయి చిత్రాలతో పోటీ పడిందని, అయితే ఇప్పుడు మళ్లీ పరిశ్రమ వెనకడుగు వేస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై చిత్రనిర్మాతలు చివరికి బాధ్యతంతా ప్రేక్షకులపైనే నెట్టేస్తారని, ఆ సమయంలో నటుల దగ్గర ఎలాంటి సమాధానం ఉండదని తాప్సీ వాపోయారు. ఈ పోరాటంలో నటులు ఒంటరివారైపోతారని, కేవలం ప్రేక్షకులు మాత్రమే తమకు సహాయం చేసి ఈ యుద్ధంలో గెలిపించగలరని ఆమె పేర్కొన్నారు.
కాగా, రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శలు, యష్ చిత్రం ‘టాక్సిక్’ లో మహిళల చిత్రీకరణపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తరుణంలో తాప్సీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ది చిత్రంలో జాన్వీని చూపించిన విధానంపై విమర్శలు రావడంతో ఆ సన్నివేశాలను తొలగించి దర్శకుడు బుచ్చి బాబు క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.