పంజాబీ సుందరి తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో దూసుకుపోతున్నది. మహిళా ప్రధాన చిత్రాల్ని ఎంపికచేసుకుంటూ తనకంటూ ప్రత్యేకపంథాను సృష్టించుకుంది. వరుసగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్న ఈ భామ వాటికి కాస్త విరామమిచ్చి కమర్షియల్ కథల్ని ఎంచుకునే ఆలోచనలో ఉందట. బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ సరసన ఈ భామ ఓ సినిమాలో నటించబోతుందనే వార్తలొస్తున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో కథానాయికగా తాప్సీ పేరు వినిపిస్తున్నది. దీని గురించి ఆమె మాట్లాడుతూ ‘షారుఖ్‌ఖాన్ జోడీగా నటించే అవకాశమొస్తే ఆంతకుమించిన అదృష్టం ఉంటుందా?. ఒకవేళ సినిమా ఓకే అయితే ఆ విషయాన్ని స్వయంగా నేనే చెబుతా. మా ఇంటిపైకెక్కి అందరికి వినిపించేలా బిగ్గరగా అరిచి చెబుతా. షారుఖ్‌ఖాన్ వంటి గొప్ప నటుడితో నటించాలన్నది నా చిరకాల కోరిక. అది నెరవేరాలని కోరుకుంటున్నా’ అని తాప్సీ పేర్కొంది.