అందంతోపాటు అభినయపరంగానూ ప్రేక్షకుల అభినందనలందుకుంటున్నది మలయాళ మందారం సంయుక్త మీనన్. ఆమె నిఖిల్‌కి జోడీగా నటించిన పానిండియా సినిమా ‘స్వయంభు’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో సంయుక్త యువరాణిగా కనిపించనున్నది. ఈ పాత్రకోసం కత్తిసాము, కర్రసాము తదితర యుద్ధ విద్యాలతోపాటు గుర్రపు స్వారీని కూడా నేర్చుకున్నది సంయుక్త. ఈ పాత్ర గురించి సంయుక్త మీనన్ మాట్లాడుతూ ‘ ‘స్వయంభు’ ఓ కొత్త ప్రపంచం.
ప్రేక్షకుల్ని కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లే సినిమా ఇది. ఇందులో నేను యోధురాలిగా కనిపిస్తా. ఈ సినిమా కోసం భయంకరమైన యుద్ధ సన్నివేశాల్లో నటించా. ఈ క్రమంలో దెబ్బలు కూడా తగిలాయి. కానీ స్క్రీన్‌పై నా కష్టాన్ని చూసుకున్నాక బాధలన్నీ మరిచిపోయా. ఇందులో నేను పోషించిన యువరాణి పాత్రను దర్శకుడు భరత్కృష్ణమాచార్య అద్భుతంగా మలిచారు. ఈ సినిమా తర్వాత ఆయన గొప్ప స్థాయిలో ఉంటారు. నిఖిల్‌తోపాటు మా అందరి కెరీర్లకూ ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది’ అని నమ్మకం వెలిబుచ్చింది సంయుక్త మీనన్. రామ్‌చరణ్ పానిండియా సినిమా ‘పెద్ది’లో కూడా కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్రలో సంయుక్త నటించినట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.