వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకోవడం బాలీవుడ్ తారలకు అలవాటుగా మారింది. తాజాగా, నటి స్వర భాస్కర్ కూడా అలాగే నోరు జారింది. ఇటీవల స్వర భాస్కర్ చేసిన కొన్ని కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారమే లేపాయి. ‘ప్రజలంతా సహజంగానే బైసెక్సువల్స్’ అంటూ ఆమె చేసిన కామెంట్స్‌పై.. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో, స్వర భాస్కర్ స్వరాన్ని మార్చింది. సరదాగా అన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారనీ, కావాలనే రాజకీయ రంగు పులుముతున్నారని యూ టర్న్ తీసుకున్నది. గతంలో ఓసారి స్వర భాస్కర్ మాట్లాడుతూ.. అందరూ బైసెక్సువల్స్ అనీ, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌పై తనకు ‘గర్ల్ క్రష్’ ఉన్నదనీ చెప్పుకొచ్చింది.
ఈ మాటలపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది స్వర. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. “ఒక మహిళపై అభిమానం, ప్రేమ ఉండటంలో తప్పేముంది? నేను ఇతర మహిళలను ఆరాధిస్తుంటా, అభిమానిస్తుంటా! అలాగే, ప్రేమిస్తుంటానని కూడా చెప్పా! ఇది అత్యంత సాధారణ విషయం. ఇందులో ఎలాంటి వివాదం ఉన్నదో నాకైతే అర్థం కావడంలేదు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, తన భర్త రాజకీయ నాయకుడు కావడం వల్లే.. తన మాటలను కావాలని వివాదంగా మారుస్తున్నారని వాపోయింది. దేశంలో చర్చించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయనీ, వాటిని పక్కన పెట్టి.. ఇలాంటి వాటిపై రచ్చ చేయడం పద్ధతికాదని హితవు పలికింది.
“నేను సరదాగా చెప్పిన మాటలకు రాజకీయ రంగు పులుముతున్నారు. నేను ఏది మాట్లాడినా.. నా భర్తపై ప్రభావం చూపుతున్నది. ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఉండాలేమో!” అంటూ చెప్పుకొచ్చింది. 2009లో ‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది స్వర భాస్కర్. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. జీ సినీ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్, సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ లాంటివి అందుకున్నది. 2022లో వచ్చిన ‘జహా చార్ యార్’ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. 2023లో ఆమె సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్‌ను పెండ్లి చేసుకుంది.