Surya S/o Krishnan Movie | తినగ తినగా వేప తియ్యగుండూ లాగా కొన్ని సినిమాలను రిపీటెడ్గా చూస్తుంటే తెలియకుండానే వాటికి కనెక్ట్ అయిపోతాం. రిలీజైనప్పుడు అలాంటి సినిమాలను పెద్దగా పట్టించుకోం. కానీ తర్వాత తర్వాత ఆ సినిమాలు చూస్తుంటే.. ఇంత మంచి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని మనమే అనుకంటుంటాం. అలాంటి సినిమాల్లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఒకటి. సూర్య ఈ సినిమాలో చూపించిన వేరియేషన్లకు ఒక పుస్తకమే రాయోచ్చు. సినిమాలో సూర్య నటించాడా.. జీవించాడా అనే రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు సూర్య నటన అంటే తెలియాలంటే ఈ ఒక్క సినిమా చూస్తే సరిపోతుంది. ఇక గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక అందమైన కథతో అందరి చేత కంట నీరు పెట్టించాడు. కంటనీరంటే మళ్లీ ట్రాజిక్ స్టోరీ అనుకునేరో.. ఇదో అందమైన ప్రేమకథ. అంతకు మించి ఫ్యామిలీతో అనుబంధాల గురించి చెప్పే కథ.
పదిహేనేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. టీవీల్లో మాత్రం సంచలనం సృష్టించింది. ఇక హ్యారిస్ జైరాజ్కైతే గుడి కట్టచ్చు. అంత గొప్పగా పాటలను ట్యూన్ చేశాడు. ఒకటి, రెండు అని కాదు ఈ సినిమాలో పాటలన్నీ వేరే లెవల్లో ఉంటాయి. కాగా తాజాగా ఈ సినిమా తెలుగులో రీ-రిలీజైంది. తెలుగు సినిమా రీ-రిలీజైతే ఏ రేంజ్లో సందడి ఉంటుందో ఈ సినిమాకు కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిజానికి ఇక్కడ సూర్య సినిమాలకు మంచి క్రేజే ఉంది. కానీ రీ-రిలీజ్ సినిమాకు కూడా అంతలా థియేటర్లకు ఎగబడుతున్నారంటే ఆయన రేంజ్ ఏంటో ఇట్టే అర్థమయిపోతుంది. కాగా శుక్రవారం రీ-రిలీజైన ఈ సినిమా తొలిరోజే దాదాపు కోటీ వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది.
ఇక థియేటర్లన్నీ మ్యూజిక్ కాన్సర్ట్లైపోయాయి. హ్యారిస్ పాటలను థియేటర్లోని ప్రేక్షకులంతా హమ్ చేస్తున్నారు. సినిమాకు డబ్బింగ్ చెబుతున్నారు. ఎంతైనా తెలుగు వాళ్లు సినిమాలను ఆదరించినంత మరెవరు ఆదరించలేరు. సినిమా నచ్చితే హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరూ అని ఆలోచించకుండా థియేటర్లకు ఎగబడి వెళ్తారు. సినిమాలను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు.