తమిళ అగ్ర హీరో సూర్య ప్రయోగాలకు పెట్టింది పేరు. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు చేస్తుంటారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలు స్ఫూర్తివంతమైన కథాంశాలతో ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం సూర్య పీరియాడిక్ చిత్రం ‘కంగువ’లో నటిస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో సుధా కొంగర దర్శకత్వంలో తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు సూర్య. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘ఆకాశం నీ హద్దురా’ వంటి సూపర్‌హిట్ చిత్రమొచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం 1965లో తమిళనాడులో జరిగిన యధార్థ్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రాజేంద్రన్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో సూర్య విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని సమాచారం.