తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు అగ్ర హీరో సూర్య. ఆయన ప్రస్తుతం తెలుగు స్ట్రెయిట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది.
ఇప్పటికే ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రంలో హీరో సూర్య తన వయసుకు తగిన పాత్రలోనే కనిపిస్తారట. 40ప్లస్ వయసు వున్న వ్యక్తి 20 ప్లస్ అమ్మాయితో సాగించే ప్రేయాయణం, వారి మధ్య నడిచే భావోద్వేగభరిత ప్రయాణం నేపథ్యంలో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఈ తాజా సమాచారంతో సినిమా కాన్సెప్ట్ ఏమిటన్నది అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఈ చిత్రంలో మమితాబైజు కథానాయికగా నటిస్తున్నది.