Suriya | తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు సూర్య. ఇతడి సినిమాలు సొంత భాషలో కంటే ఇతర భాషలలో విడుదలై రికార్డులు సృష్టించాయి. ఇప్పటికే పలు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆయన, త్వరలో ‘కంగువా’ అనే భారీ ప్రాజెక్ట్‌తో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనూ పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే తాను స్టార్ అవ్వడానికి గల కారణం వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను సూర్య వెల్లడించాడు.
తాను నటుడు అవ్వడానికి గల కారణం మా అమ్మ చేసిన అప్పు అంటూ సూర్య తెలిపాడు. నటుడు అవ్వడం కంటే ముందు మా నాన్న ఒక ఆర్టిస్ట్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. అయితే ఆయన సినిమాల్లోకి వచ్చిన అనంతరం కూడా మాకు సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదు. నాన్న ఇండస్ట్రీ వారిని ఎవరిని ఇంటికి తీసుకురాలేదు. అయితే నేను చిన్నప్పుడు నుంచి కమల్ హాసన్‌కు పెద్ద అభిమానిని. అలా ఆయన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అలవాటు. కానీ నేను ఎప్పుడు మూవీ ఇండస్ట్రీ వైపు వెళ్లాలని కానీ, నటుడు అవ్వాలని కానీ అనుకోలేదు.
మా బంధువులు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలాగే నేను కూడా అటువైపు వెళదాం అనుకున్నాను. అలానే నా డిగ్రీ పూర్తి అయ్యాక ఓ గార్మెంట్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. దాదాపు 3 ఏండ్లు అందులో పనిచేశాను. అప్పుడు కూడా నాకు సినిమాల్లోకి రావాలని అనిపించలేదు. కానీ మా అమ్మ చేసిన ఒక పనికి ఇటు వైపు వచ్చాను. మా అమ్మ తన వద్ద ఉన్న వడ్డాణం కుదువ పెట్టి రూ.25 వేలు డబ్బు తీసుకుంది. అయితే ఈ విషయం మా నాన్నకి తెలియదు. అయితే ఈ డబ్బును తిరిగి ఇద్దాం అనుకున్నప్పుడు పరిస్థితుల కారణంగా ఇవ్వలేక పోయాం. అప్పుడే ఏం చేయాలి అని ఆలోచిస్తున్న నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో ఒక నటుడు తప్పుకోవడంతో నన్ను హీరోగా ఎంచుకున్నారు. దీంతో ఆ మూవీలో నటించి అప్పు కట్టాను అంటూ సూర్య చెప్పుకోచ్చాడు.