సూర్య కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘సురారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) హిందీలో రీమేక్ కానుంది. ఏయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత ఏడాది ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. సూర్య నటనకు, సుధ కొంగర దర్శకత్వ ప్రతిభకు మంచి ప్రశంసలు దక్కాయి. హిందీ రీమేక్‌ను స్వీయ నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మించబోతున్నారు. మాతృక దర్శకురాలు సుధ కొంగర హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయనుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా ఎవరు నటించనున్నారనే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.