కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో మళ్లీ విజయాల బాట పట్టారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ప్రస్తుతం ఆయన హ్యాట్రిక్‌పై కన్నేశారు. మలయాళం చిత్రం ‘ఆవేశం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్ దర్శకత్వంలో ప్రస్తుతం సూర్య సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్లో ఇది 47వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో సూర్య పోలీస్ అధికారిగా కనిపించనున్నట్టు తెలిసింది. పోలీస్‌గా సూర్యకు ‘సింగం’ ఫ్రాంచైజీ ఎంతటి గుర్తింపు తెచ్చిందో తెలిసిందే. అయితే ‘సింగం’లోని పోలీస్ పాత్రకూ ఈ సినిమాలోని పోలీస్ పాత్రకూ అస్సలు పొంతన ఉండదట.
ఇందులో సూర్య విభిన్నమైన మనస్తత్వం కలిగిన అసాధారణ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్టు తెలిసింది. భిన్నమైన ఆలోచనలు, విచిత్రమైన ప్రవర్తనతో వెరైటీగా ఈ పాత్రను దర్శకుడు డిజైన్ చేశాడట. ఓ ప్రత్యేక పోలీస్ బృందానికి లీడర్‌గా సూర్య వ్యవహరిస్తారని వినికిడి. బలమైన భావోద్వేగాలతోపాటు యాక్షన్, కామెడీ మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది.