Mohan Babu | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలపై ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది.వివరాల్లోకి వెళితే, మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థుల సమస్యలపై నిరసనకు దిగిన సందర్భంలో ఈ కేసు నమోదైంది. ఆయనకు చెందిన విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు
ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మోహన్‌బాబుకు, తాజాగా కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. కేసులో ఉన్న ప్రొసీడింగ్స్ అన్నింటినీ కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మోహన్‌బాబు కుటుంబానికి న్యాయపరంగా ఊరట లభించగా, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే.. 2014 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వం నుంచి తమ సంస్థ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలని ఏపీ గవర్నమెంట్ చెల్లించడం లేదని తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు.
రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని వారిపై పలు సెక్షన్ల కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్ల తమ సంస్థ అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించబడేదని, కానీ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పరిస్థితి మారిపోయిందని మోహన్ బాబు పలు ఆరోపణలు చేశారు.