ఇక సినిమాలు ఆపేస్తారేమో అనే వదంతులకు చెక్ పెడుతూ ఒకేసారి రెండు చిత్రాలకు అంగీకారం తెలిపారు సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇటీవల ఆయన సినిమాలు వరుసగా అపజయాల పాలవడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంటారేమో అనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే తనకు రిటైర్మెంట్ ఆలోచనే లేదని చెప్పకనే చెప్పారు రజనీ. ఆయన తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థలో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేశారని సమాచారం.
ఈ సంస్థ నిర్మాణంలో రజనీకాంత్ రోబో సీక్వెల్ ‘2.ఓ’, ‘దర్బార్’ సినిమాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఒకదాన్ని ‘డాన్’ సినిమా దర్శకుడు శిబి చక్రవర్తి రూపొందిస్తారని, మరో సినిమాను డెసిగ్ను పెరియసామి తెరకెక్కిస్తారని చెప్పుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఉండబోతున్నాయట. వీటికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ త్వరలో రానుంది. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. రజనీకాంత్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు.