Rajinikanth | తాను రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు వచ్చిన వార్తలను సూపర్ స్టార్ రజినీ కాంత్ తోసిపుచ్చారు. ఏ సమయంలోనూ రాజకీయాల్లోకి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందించుకోలేదని సోమవారం తేల్చి చెప్పారు. సోమవారం ఆయన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ కావడంతో రజినీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు హల్చల్ చేశాయి.
ఈ అంశంపై తన నివాసం బయట రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. మీరు రాజకీయాల్లోకి తిరిగి వస్తారా.. ఆ ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించినప్పుడు రజినీకాంత్ `నో` అని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనడం గానీ, రాజకీయాల్లోకి రావడం గానీ లేదని తేల్చేశారు. తాను ఆధ్యాత్మికతను ప్రేమిస్తానని పేర్కొన్నారు.
పాలు, పెరుగు వంటి ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడంపై స్పందించడానికి రజినీకాంత్ నిరాకరించారు. త్వరలో రానున్న సినిమా కోసం ఈ నెల 15 లేదా 22న షూటింగ్ జరుగుతుందన్నారు. సినీ నిర్మాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి `జైలర్` సినిమా కోసం రజినీకాంత్ పని చేస్తారు. కన్నడ సినీ నటుడు శివ్‌రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తారన్నారు. కొన్ని నెలల క్రితం సన్ పిక్చర్స్ `జైలర్` టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది.