సూపర్‌హీరో కాన్సెప్ట్‌లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఎక్కువ. ఈ తరహా చిత్రాలు హాలీవుడ్లో ఎక్కువ తయారవుతుంటాయి. అయితే.. ఈ ట్రెండ్ కొన్నేళ్ల క్రితం మనదేశంలోనూ మొదలైంది. బాలీవుడ్లో రాకేష్ రోషన్ తెరకెక్కించిన ‘కోయీ మిల్గయా’తో మొదలైన ఈ సూపర్‌హీరో ఫీవర్.. యష్‌రాజ్ ఫిల్మ్స్ ‘ధూమ్’తో మరింత హీటెక్కింది. ‘కోయీ మిల్గయా’కు కొనసాగింపుగా ‘క్రిష్’ ఫ్రాంచైజీ మూడు భాగాలుగా రాగా, ఇప్పుడు నాలుగో భాగం తెరకెక్కించేందుకు హృతిక్ రోషన్ సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ ‘క్రిష్’ ఫ్రాంచైజీని రాకేష్ రోషన్ రూపొందించారు. ఈ నాలుగో భాగాన్ని మాత్రం హృతిక్ రోషనే స్వయంగా డైరెక్ట్ చేయనున్నారు. ఇక ‘ధూమ్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పటికే విడుదలైన మూడు భాగాలూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్ హీరోగా నాలుగో పార్ట్‌ని యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించనుంది. ఇదంతా బాలీవుడ్ కహానీ. ఇక టాలీవుడ్ విషయానికొస్తే మనకు కూడా సూపర్‌హీరో కాన్సెప్టులు కొత్తేం కాదు. గతంలో సీనియర్ ఎన్టీయార్ ఇలాంటి పాత్రలు ఎన్నో చేశారు. చిరంజీవి చేసిన జగదేకవీరుడు-అతిలోకసుందరి, కొదమసింహం లాంటి చిత్రాలు ఓ విధంగా సూపర్‌హీరో కాన్సెప్టులే. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న సూపర్‌హీరో సినిమాల విషయానికొస్తే.. ముందు చెప్పుకోవాల్సిన సినిమా ‘హరి హర వీరమల్లు’. ఇందులో రాబిన్‌హుడ్ తరహా పాత్రను పోషించారు పవన్‌కల్యాణ్. మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబుతో తలపడే పాత్ర ఆయనది. సూపర్‌హీరో చేసే సాహసాలన్నీ ఇందులో పవన్‌కల్యాణ్ పాత్ర చేస్తుందని సమాచారం. ముఖ్యంగా పిల్లలు ఇష్టపడేలా ఆయన పాత్ర సాగుతుందని అంటున్నారు.
ఈ ఏడాది రానున్న మరో సూపర్‌హీరో సినిమా ‘విశ్వంభర’. ప్రపంచాన్ని కాపాడేందుకు, మానవ శక్తితో మరో గెలాక్సీలోకి అడుగుపెట్టిన ఓ సామాన్యుడి కథ ఇది. ఇందులో చిరంజీవి కారణజన్ముడిగా కనిపిస్తారు. ఈ సినిమాలో మెగాస్టార్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ రోమాంచితం చేస్తాయని సమాచారం. 70శాతం సీజీతో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. దసరా కానుకగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్‌తో అట్లీ చేయబోతున్న ‘ఐకాన్'(ప్రచారంలో ఉన్న పేరు) సినిమా కూడా సూపర్‌హీరో కాన్సెప్టే అని టాక్. పైగా ఇందులో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న పాత్రల కోసం న్యూయార్క్ ఫిల్మ్ స్టూడియోలో టెస్ట్ షూట్ కూడా పూర్తి చేశారని టాక్.
ఒకే స్క్రీన్‌పై ఒకే రూపంలో ఉన్న ముగ్గురు సూపర్ హీరోలు.. అట్లీ ప్లాన్ నిజంగా అదిరిపోయిందంటున్నారు సినీ అభిమానులు. ఇక ‘హను-మాన్’ఫేం తేజా సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా కూడా సూపర్‌హీరో కాన్సెప్టే. విధికి ఎదురెళ్లిపోరాడే ఓ యోధుడి కథగా ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. ఇంకా ప్రశాంత్‌వర్మ యూనివర్స్ నుంచి రాబోతున్న మహాకాళి, అధీర చిత్రాలు సైతం సూపర్‌హీరో కాన్సెప్టులతోనే రూపొందనున్నాయి. అమీర్‌ఖాన్‌తో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించబోయే సినిమా కూడా సూపర్‌హీరో కథాంశమే అని వినికిడి. ఈ విధంగా స్టార్ హీరోలంతా సూపర్‌హీరోలుగా మారే పనిలో పడ్డారన్నమాట. మరి ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.