Super Man | ఒకవైపు ఇండియాలో సెన్సార్షిప్ వివాదంతో వార్తల్లో నిలిచిన హాలీవుడ్ చిత్రం ‘సూపర్ మ్యాన్'(Super Man) వరల్డ్ వైడ్‌గా మాత్రం వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం వారం రోజుల్లో రూ.1900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో సూపర్‌హీరో సినిమాలకు క్రేజ్ తగ్గిపోతుందన్న వార్తలను ఈ సినిమా కొట్టిపడేసింది. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డేవిడ్ కోరెన్స్వెట్ సూపర్ మ్యాన్ పాత్రలో నటించాడు. డీసీ కామిక్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం జూలై 07 ప్రీమియర్ అవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా జూలై 11న విడుదలైంది.
225 మిలియన్ US డాలర్లు(రూ.1930 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు 220 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకో 5 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాలి. మరోవైపు హాలీవుడ్ నుంచి వచ్చిన లిలో & స్టిచ్(lilo & stitch) అనే చిత్రం ఏకంగా రూ.8,530 కోట్ల వసూళ్లను సాధించింది. జూరాసిక్ వరల్డ్ రీ బర్త్(Jurassic World Rebirth) చిత్రం రూ.4,549 కోట్ల వసూళ్లను రాబట్టగా.. బ్రాడ్ పీట్ నటించిన F1 చిత్రం రూ. 3,372 కోట్ల వసూళ్లను సాధించింది.