Sunny Leone | కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం మథురలో నిర్వహించాల్సిన బాలీవుడ్ నటి సన్నీ లియోన్ డీజే షో చుట్టూ నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. స్థానిక సాధువులు, ధార్మిక సంస్థలు, భక్తుల తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన మధురలోని ఒక ప్రతిష్ఠాత్మక హోటల్లో జనవరి 1వ తేదీ రాత్రి సన్నీ లియోన్ డీజే షో నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర స్వాగతంగా రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగే ఈ ఈవెంట్‌కు టికెట్ల విక్రయాలు కూడా పూర్తయ్యాయి. సుమారు 300 మంది అతిథుల కోసం కబానా, హట్ వంటి లగ్జరీ సీటింగ్ ఏర్పాట్లు చేసినట్లు హోటల్ యాజమాన్యం వెల్లడించింది.
అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన సమాచారం బయటకు రావడంతో బ్రజ్ ప్రాంతానికి చెందిన సాధువులు, ధార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. మధుర వంటి ఆధ్యాత్మిక నగరంలో ఇలాంటి వినోద కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నగర పవిత్రతకు భంగం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. భజనలు, కీర్తనలతో మార్మోగాల్సిన శ్రీకృష్ణ జన్మభూమిలో అశ్లీలతను ప్రోత్సహించే ప్రదర్శనలు సహించబోమని హెచ్చరించారు. ఈ విషయమై మధుర జిల్లా మెజిస్ట్రేట్‌కు సాధువులు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసనలు చేపట్టారు. వ్యతిరేకత రోజురోజుకూ పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీకృష్ణుడు పుట్టిన పవిత్ర స్థలంలో ఇలాంటి షోలు నిర్వహించడం తగదని స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు.
పరిస్థితిని గమనించిన హోటల్ యజమాని మితుల్ పాఠక్ సన్నీ లియోన్ డీజే షోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సన్నీ లియోన్‌ను కేవలం ఒక కళాకారిణిగానే ఆహ్వానించామని, చట్టపరమైన అనుమతులు ఉన్నప్పటికీ సమాజం, సాధువుల మనోభావాలను గౌరవించడం తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. బ్రజ్ సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమని, శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. దీంతో మధురలో నెలకొన్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.