ఇటీవల విడుదలైన సన్నీడియోల్ ‘జాట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి ఆదరణ లభిస్తున్నది. రోమాంచితమైన పోరాటఘట్టాలు, సన్నీడియోల్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్స్‌గా నిలిచాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమాకొస్తున్న అద్భుతమైన ఆదరణ దృష్ట్యా సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నారు.
ఈ విషయాన్ని హీరో సన్నీడియోల్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. సీక్వెల్‌కి కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నారు. ‘జాట్ ఆన్ టూ ఏ న్యూమిషన్’ అంటూ సీక్వెల్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించారు సన్నీ డియోల్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీక్వెల్‌కు సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.