‘ధమాకా’తో వందకోట్ల విజయాన్ని అందుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు ఫిబ్రవరి 11న ‘మజాకా’తో రానున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడు. రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మాతలు. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని ఘనంగా విడుదల చేశారు.
సందీప్‌కిషన్, రీతువర్మ వైజాగ్ ఆర్కే బీచ్‌లో డ్రింక్ చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో టీజర్ మొదలైంది. అది వారి అరెస్ట్‌కు దారితీయడం, తద్వారా వారిమధ్య ఏర్పడిన కలహం ప్రేమగా పరిఢమిల్లడం ఈ టీజర్లో చూడొచ్చు. సందీప్ తండ్రిగా రావురమేష్ కనిపించారు. ఆయనకు కూడా ఓ ప్రేమకథ ఉన్నట్టు టీజర్ చెబుతున్నది. తండ్రీ కొడుకుల కెమిస్ట్రీ ఈ టీజర్లో హైలైట్. మొత్తంగా వినోదాత్మక చిత్రమని ఈ టీజర్ చెప్పకనే చెబుతున్నది. దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న నిజాయితీగా పనిచేస్తారని, త్రినాథరావు దర్శకత్వంలో నటించాలనే కోరిక ఇన్నాళ్లకు తీరిందని, భైరవకోన, రాయన్ విజయాల తర్వాత తన నుంచి వస్తున్న సినిమా ఇదని హీరో సందీప్‌కిషన్ చెప్పారు. ఈ కథే అందరినీ ఎంచుకున్నదని, ప్రసన్న అద్భుతమైన కామెడీ రాశారని, సందీప్ గొప్పగా నటించారని, ‘మన్మథుడు’ఫేం అన్షూ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నదని, కుటుంబసమేతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని నక్కిన త్రినాథరావు తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.