Suma | తెలుగు బుల్లితెర ప్రపంచంలో ‘యాంకర్’ అంటే గుర్తొచ్చే మొదటి పేరు సుమ కనకాల. తనదైన హాస్యం, చలాకీతనం, గలగలా మాట్లాడే స్టైల్‌తో టాలీవుడ్లో సుమకి ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. చిన్నా పెద్దా ఏ ఈవెంట్ అయినా సుమ స్టేజ్‌పైకి వస్తే ఆ వేడుక మరోస్థాయికి చేరుతుంది. యాంకరింగ్‌కు కొత్త ప్రమాణాలు అద్దిన సుమను అభిమానులు ‘ఈవెంట్ క్వీన్’గా సత్కరిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా సుమ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆమె భర్త, నటుడు రాజీవ్ కనకాలతో విభేదాలు ఏర్పడ్డాయని, విడాకులు తీసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై ఇంతవరకు స్పందించని సుమ, తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్‌కు పులిస్థాప్ పెట్టారు.
“వివాహం అనేది రెండు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం. ఆ ప్రయాణంలో వాదోపవాదాలు, మనస్పర్థలు సహజమే. మా పెళ్లయి పాతికేళ్లు అవుతుంది. ఈ కాలంలో చాలా నేర్చుకున్నాం, అనుభవించాం. కెరీర్, కుటుంబం, పిల్లలను బ్యాలెన్స్ చేయడంలో చిన్న చిన్న విభేదాలు రావడం సహజం. కానీ అవి విడాకుల వరకు వస్తాయని అనుకోవడం పూర్తిగా తప్పు” అని సుమ స్పష్టం చేసింది.ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ .. “మేం కలిసి కనిపించినా కూడా కొందరు ‘అరె! మీరు విడిపోలేదా?’ అని అడుగుతారు. కొందరైతే నేరుగా విడాకులు తీసుకున్నారని కూడా రాస్తారు. మొదట్లో బాధపడ్డాం, ఇప్పుడు అలాంటి మాటలను పట్టించుకోవడం మానేశాం. అప్పుడప్పుడు నవ్వుకుంటాం కూడా” అని తెలిపారు.
సుమ చెప్పిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త రాజీవ్‌తో ఉన్న సంబంధంపై నెలకొన్న అపోహలకు ఈ ఇంటర్వ్యూతో పూర్తిగా క్లారిటీ వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సుమ తన కెరీర్లోలా, వ్యక్తిగత జీవితంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతోంది. రూమర్స్‌ను మాటలతో కాదు, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం ఆమె స్టైల్ అంటున్నారు అభిమానులు. ఇక సుమ తనయుడు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రోషన్ నటించిన మోగ్లీ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది.