Sukumar | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ‘పెద్ది’ చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 4న విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు సానా దర్శకత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు.
అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి దర్శకుడు సుకుమార్. రామ్ చరణ్ నటన గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఉత్సాహపరిచాయి. ‘పెద్ది’లో చరణ్ అద్భుతంగా నటించాడని, కొన్ని సందర్భాల్లో ‘రంగస్థలం’లోని నటనను కూడా మించిపోయాడని తెలిపారు. చరణ్ నటనను చూస్తుంటే ఆశ్చర్యం కలిగిందని, సినిమాలో ఆయన పాత్రలో పూర్తిగా లీనమైపోయాడని సుకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు సుకుమార్‌ను ఆర్సీ17 సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను మాటలు చెప్పే మనిషిని కాదు. సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. మీరు ఎంత ఊహించుకున్నా దాన్ని మించి సినిమా ఉంటుంది” అని అన్నారు.
పలుమార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తూ, అభిమానుల ఊహలకు అందని స్థాయిలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. సుకుమార్ చేసిన ఈ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్సీ17పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వాటిని మరింత పెంచేశాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి ప్రాంతీయ చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.