Sudigali Sudheer | యాంకర్ సుడిగాలి సుధీర్, నటి దివ్యభారతి జంటగా నటించిన ‘గోట్’ (G.O.A.T) సినిమా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం చుట్టూ పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సుధీర్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం, దర్శకుడి పేరు లేకుండా సినిమాను రిలీజ్ చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ స్పష్టతనిచ్చారు. ఈ చిత్రాన్ని నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. రెండున్నరేళ్ల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా, దర్శకుడు–నిర్మాతల మధ్య వచ్చిన తగాదాల కారణంగా మధ్యలో నిలిచిపోయింది. ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ విడుదలైపోయినా, ఆ తర్వాత షూటింగ్ ఆగిపోయింది.
చివరికి సినిమా పూర్తయినా, ఇప్పుడు డైరెక్టర్ పేరును ఉపయోగించకుండా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. మరోవైపు సుధీర్ ప్రమోషన్లలో పాల్గొనకపోవడంపై నిర్మాత చంద్రశేఖర్ స్పందించారు. సుధీర్ చాలా రెస్పాన్సిబుల్ వ్యక్తి. ఆయనకు పెద్ద బడ్జెట్ పెట్టాం. ఆయన న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది అని అన్నారు. అయితే దర్శకుడు వ్యవహారశైలి, అనుచిత ప్రవర్తన వల్ల హీరో కూడా అసౌకర్యం అనుభవించాడని చెప్పారు. దర్శకుడు నరేష్ కుప్పిలిపై నిర్మాత పలు ఆరోపణలు చేశారు. హీరోయిన్ దివ్యభారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లతో టార్గెట్ చేశాడు.
సినిమా నుంచి తొలగించిన తర్వాత సీన్లు లీక్ చేయడం, ఇండస్ట్రీలో పలు చిత్రాల నుంచి తొలగించబడిన చరిత్ర ఆయనకి ఉంది. నిర్మాత దిల్ రాజు సినిమా నుంచి కూడా ఆయనని తీసేసారు. ఆయన ప్రవర్తన, పనితీరులో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. ఈ చర్యలపై చాంబర్‌ను సంప్రదించగా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించినట్లు చంద్రశేఖర్ వెల్లడించారు. కేసు కోర్టులోనూ కొనసాగుతోంది. ఈ విషయాలన్నీ బయట పెడితే సుధీర్ కెరీర్ ప్రభావితం అవుతుందని ఇప్పటి వరకూ చెప్పలేదు. ఏడాది నుంచి దర్శకుడు మా టీమ్‌ను, సినిమాను ట్రోల్ చేస్తున్నాడు అని చంద్రశేఖర్ అన్నారు. సుధీర్‌కు నిజాలు తెలుస్తాయి. భవిష్యత్ లో ప్రమోషన్లకు వస్తాడని ఆశిస్తున్నాం. గోట్’ ఆయన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు.