Rajinikanth New Movie | సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ సుధా కొంగరతో రజనీ ఓ సినిమా చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇదే విషయంపై తాజాగా స్పందించింది సుధా కొంగరా. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ‘పరాశక్తి’ అనే చిత్రం రూపొందుతోంది. పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1960ల నాటి నేపథ్యంలో సాగే ఈ భారీ బడ్జెట్ చిత్రం 2026 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు అని ప్రస్తావన రాగా.. సుధా మాట్లాడుతూ.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఒక స్వచ్ఛమైన ప్రేమకథను తెరకెక్కించడమే తన జీవిత ఆశయమని ఆమె తాజాగా పేర్కొన్నారు. రజనీకాంత్ వంటి లెజెండరీ నటుడిని ఒక వైవిధ్యమైన లవ్ స్టోరీలో చూడాలని ఉందన్న ఆమె, ఇప్పటికే తన వద్ద ఒక అద్భుతమైన కథ సిద్ధంగా ఉందని వెల్లడించారు. అయితే ఆ కథను పూర్తిస్థాయిలో డెవలప్ చేయాల్సి ఉందని, రజనీ సర్ ఒప్పుకుంటే అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాను సినిమాల నుంచి త్వరగానే రిటైర్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అన్నీ కుదిరితే రజనీకాంత్ తన కెరీర్ చివరి దశలో ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.