కాస్త డబ్బు, పేరు ప్రఖ్యాతులు రాగానే చాలా మంది సొంత ఊళ్లను వదిలి నగర జీవితంవైపే మొగ్గుచూపుతుంటారు. ఇక వీరిలో సినిమా సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేటి రోజుల్లో సొంత ఊరిలో నివాసం ఉండే సినీతారలు ఎక్కడా కనిపించరు. కానీ ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టి అందరిలో చాలా ప్రత్యేకం. దక్షిణ కన్నడ సంస్కృతి, సంప్రదాయాలపై అపారవిశ్వాసం కనబరిచే ఆయన గత నాలుగేళ్లుగా సొంత ఊరు కుందాపురలోనే నివాసం ఉంటున్నారట. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార చాప్టర్-1’ ఇటీవలే విడుదలై దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం 300కోట్ల మైలురాయిని దాటింది. ఈ విజయానందాన్ని ఆయన తన సొంత ఊరి ప్రజల మధ్యన ఆస్వాదిస్తున్నారు.
‘గత నాలుగేళ్లుగా రిషబ్‌శెట్టి కుందాపురలోనే (కర్ణాటక ఉడిపి జిల్లా) ఉంటున్నారు. ‘కాంతార చాప్టర్-1’ తాలూకు అధిగ భాగం షూటింగ్‌ను కూడా తన ఊరి పరిసర ప్రాంతాల్లోనే జరిపాడు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం తన టీమ్ మొత్తాన్ని కుందాపురకు రప్పించాడు’ అని ఆయన సన్నిహితులు చెప్పారు. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా రిషబ్‌శెట్టి తన సొంత ఊరిపై ఉన్న ప్రేమను బయటపెట్టారు.
ఎంత ఎదిగినా తన సంస్కృతి మూలాలను మరచిపోనని, తన పిల్లలు ప్రస్తుతం ఇక్కడే చదువుకుంటున్నారని, భవిష్యత్తులో చదువు విషయంలో వారి ఇష్టప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని, తాను మాత్రం మరికొన్నేళ్లు కుందాపురలోనే ఉండాలనుకుంటున్నానని అన్నారు రిషబ్‌శెట్టి. ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం లాంగ్న్‌ల్రో 700కోట్ల మైలురాయిని చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.