Tanya Ghavri | అతిలోక సుందరి శ్రీదేవితోపాటు ఆమె కూతుళ్లకూ స్టయిలిస్ట్‌గా పనిచేయడం.. తన వృత్తిజీవితానికి పరిపూర్ణత తీసుకొచ్చిందని అంటున్నది బాలీవుడ్ టాప్ స్టయిలిస్ట్ తాన్య ఘావ్రీ! ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాలను మరింత అందంగా చూపించడం.. తన కెరీర్లోనే గొప్ప విషయమని చెప్పుకొచ్చింది. శ్రీదేవికి స్టయిలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తాన్య.. ఇప్పుడు జాన్వీకపూర్, ఖుషీకపూర్ కోసం కూడా పనిచేస్తున్నది. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. శ్రీదేవి కుటుంబంతో తనకున్న అనుభవాలను పంచుకున్నది.
‘శ్రీదేవి దగ్గర స్టయిలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసేవారు. ఫ్యాషన్రంగం, కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను ఓపికగా చెప్పేవారు’ అంటూ శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నది తాన్య. ఇక జాన్వీ-ఖుషీ గురించి చెబుతూ.. వారిద్దరి స్టయిల్ వారి తల్లినే పోలి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఖుషీ చాలా ఇన్పుట్స్ ఇస్తే.. జాన్వీ సృజనాత్మకంగా ఆలోచిస్తుందనీ అంటున్నది.
వయసులో చిన్నవారే అయినప్పటికీ.. ఫ్యాషన్‌రంగంపై వారికి మంచి పట్టుందనీ, తమ తల్లిలాగే అన్ని విషయాలపైనా శ్రద్ధ చూపుతారని చెబుతున్నది. ఇక, బాలీవుడ్లో టాప్ స్టయిలిస్ట్ అయిన తాన్య.. మాజీ టెస్ట్ క్రికెటర్ కర్షణ్ ఘావ్రీ కూతురు. ముంబయిలో పుట్టిపెరిగింది. న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. భారత్‌కు తిరిగొచ్చాక బాలీవుడ్ సెలెబ్రిటీ స్టయిలిస్ట్‌గా కొనసాగుతున్నది.