Aishwarya Rai | తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్డు నేడు కీలక తీర్పును ఇచ్చింది. ఇకనుంచి అనుమతి లేకుండా ఐశ్వర్య ఫొటోలు, వీడియోలు వాడడానికి వీల్లేదని న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అంతేగాకుండా ఆమె ఫొటోలను అనుమతి లేకుండా వాడడం వలన ఐశ్వర్యకి ఆర్థిక నష్టం కలిగించడమే కాకుండా ఆమె గౌరవం, ప్రతిష్ఠ ను దెబ్బతీసినట్లేనని కోర్టు పేర్కొంది.
అలాగే ఈ-కామర్స్ వెబ్సైట్లు, గూగుల్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫార్మ్‌లలో ఐశ్వర్య ప్రస్తావించిన యూఆర్ఎల్లను తొలగించి, బ్లాక్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. నోటీసులు అందిన 72 గంటల్లోపు ఆ యూఆర్ఎల్లను బ్లాక్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాక, ఈ యూఆర్ఎల్లను ఏడు రోజుల్లో బ్లాక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఐటీ, సమాచార శాఖకు కూడా కోర్టు సూచించింది. మరోవైపు ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 15న జరగనుంది.