“స్టాండప్ రాహుల్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు రాజ్‌తరుణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మాతలు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు అనిల్‌రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరై బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. తనతో పాటే రాజ్‌తరుణ్ కెరీర్‌ను మొదలుపెట్టాడని..కొత్త కథల్ని ఎంచుకుంటూ నటుడిగా ప్రత్యేకతను చాటుకుంటున్నాడని వరుణ్‌తేజ్ తెలిపారు. కామెడీతో పాటు చక్కటి భావోద్వేగాలున్న చిత్రమిదని అనిల్‌రావిపూడి అన్నారు. సీనియర్ నటి ఇంద్రజ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాయిక వర్ష..హీరో రాజ్‌తరుణ్‌ను సరైన దారిలో పెడుతుంది. అదే విధంగా సహజీవనం అనే అంశాన్ని చాలా సున్నితమైన కోణంలో తెలియజెప్పారు. అందుకే యువతకు బాగా కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది. ‘ఇది కేవలం కామెడీ సినిమా కాదు. మనం ప్రేమించిన వారికోసం నిలబడాలి, పోరాటం చేయాలనే స్ఫూర్తినిస్తుంది. యువతతో పాటు పెద్దలకు కూడా నచ్చుతుంది’ అని దర్శకుడు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.