Chiranjeevi | కొంతకాలంగా టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది. పాత క్లాసిక్ సినిమాలు మళ్లీ తెరపైకి వచ్చి అభిమానులని అలరిస్తున్నాయి. ప్రత్యేకించి స్టార్ హీరోల బర్త్‌డేలకు, వార్షికోత్సవాలకి ఇలా సినిమాలు మళ్లీ విడుదల చేసి అభిమానులని ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా వచ్చిన “స్టాలిన్” సినిమా మాత్రం ఆశించినంత ప్రభావం చూపలేకపోయింది. ఆగష్టు 22న చిరంజీవి తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు భారీ ఉత్సాహంతో సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఆయన నటిస్తున్న సినిమాలపై అనేక అప్డేట్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. కానీ చిరు గత హిట్ మూవీస్‌లో ఒకటైన “స్టాలిన్” సినిమా రీ-రిలో మాత్రం థియేటర్లలో పెద్దగా సందడి కనిపించలేదు.
2006లో విడుదలైన స్టాలిన్ సినిమాకు స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. చిరంజీవి – త్రిష జోడీ, అలాగే ప్రకాష్ రాజ్, ఖుష్బూ, ఊర్వశి శారద వంటి నటుల విలక్షణ నటనతో సినిమా అప్పట్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. రాజకీయ డ్రామాతో పాటు మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ చిత్రం, కమర్షియల్‌గా బాగానే ఆడింది.అయితే ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన మాత్రం వెరేలా ఉంది. ఇతర చిరంజీవి రీ-రిలీజ్ సినిమాలు (ఇంద్ర, గరుడవేగ, గ్యాంగ్ లీడర్ లాంటి) ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ, స్టాలిన్ మాత్రం ఆ స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది. ఓవరాల్ గా ‘స్టాలిన్’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 23 లక్షల గ్రాస్ ను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘స్టాలిన్’ రీ రిలీజ్ లో తొలి రోజు ఓవరాల్ గా 5 వేల టిక్కెట్స్ కూడా తెగలేదనే టాక్ నడుస్తుంది. ఫ్యాన్స్ షోలు ఏవో కొన్ని మాత్రమే టికెట్స్ తెగాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఓవర్సీస్ లో పెద్దగా పట్టించుకోలేదు. నెటిజన్స్ అంచనా ప్రకారం, స్టాలిన్ రీ రిలీజ్ ఫెయిల్యూర్ కి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. అప్పట్లో ఇది కొత్తగా అనిపించినా, ఇప్పుడు చాలా మందికి పాతగా అనిపించొచ్చు. కథలో ఉన్న కొన్ని లోపాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. స్టాలిన్‌లోని యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్, పాటలన్నీ ఇప్పటికే రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దాంతో థియేటర్‌కి వెళ్లే ఆసక్తి తగ్గింది. “ఇంద్ర”, “ఠాగూర్”, “ఖైదీ నంబర్ 150” లాంటి సినిమాలు అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. కానీ స్టాలిన్ అదే స్థాయిలో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకోలేకపోయింది అని అంటున్నారు.