రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం కెన్యాలో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కథానుగుణంగా అత్యధిక భాగాన్ని అక్కడే తెరకెక్కిస్తారని చెబుతున్నారు. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈ సాహసగాథలో మహేష్‌బాబు పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో సాగుతుందని సమాచారం. కెన్యా షూటింగ్ సందర్భంగా చిత్రబృందం ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని కలుసుకుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ సదరు మంత్రి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
భారీ కథాంశాల్ని ప్రభావవంతంగా తెరపై ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన రాజమౌళి తమ దేశంలో షూటింగ్ జరపడం ఆనందంగా ఉందని, ప్రపంచ వేదికపై తమ దేశ అందాలను, విభిన్న భౌగోళిక స్వరూపాన్ని ఆవిష్కరించడంలో ఈ సినిమా దోహదపడుతుందని, తమ చరిత్రను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదొక అవకాశమని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దాదాపు 1200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సింగిల్ పార్ట్ ఫిల్మ్‌గా రిలీజ్ చేస్తారని, 2027 ప్రథమార్థంలో ఈ సినిమా విడుదల ఉంటుందని తెలిసింది. ‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.