Avatar 3: Fire and Ash | హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్ 3: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3: Fire and Ash) డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదల సందర్భంగా ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమాలో ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తుండగా.. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్‌ను ‘అవతార్ 3’ సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శించేందుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘వారణాసి’ సినిమాను పాన్-వరల్డ్ స్థాయిలో, గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమా క్రేజ్ గురించి ప్రేక్షకులకు ఒకేసారి పరిచయం చేయాలంటే, ‘అవతార్ 3’ లాంటి భారీ వేదిక సరైనదని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు వారణాసి మాత్రమే కాకుండా క్రిస్టోఫర్ నోలన్, మార్వెల్ స్టూడియోస్‌కు చెందిన కొత్త చిత్రాల టీజర్లను కూడా ‘అవతార్ 3’తో పాటు ప్రదర్శించే అవకాశం ఉందని హాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.