‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అపూర్వ ఆదరణ సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందించబోయే సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తినెలకొని ఉంది. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.
భారతీయ పురాణాలు, చరిత్ర, సంస్కృతి మూలాల్ని ఆధారంగా తయారు చేసిన కథలతో వాణిజ్యపరమైన చిత్రాల్ని తెరకెక్కిస్తుంటారు రాజమౌళి. మహేష్‌బాబుతో తీయబోయే అడ్వెంచర్ సినిమా కోసం కూడా రామ బంటు, మహా బలవంతుడు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకున్నారని చెబుతున్నారు. హనుమంతుడి గుణగణాలు, ధైర్యసాహసాల్ని మహష్‌బాబు పాత్రకు అన్వయిస్తూ హాలీవుడ్ స్థాయి అడ్వెంచర్ కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.