రాజమౌళి, మహేశ్‌బాబు సినిమా అప్డేట్ అంటూ కొందరు నెటిజన్లు తోచినట్టు రాసేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానున్నదంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానున్నదట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో కనీవినీ ఎరుగని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించనున్నట్టు ఈ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో భారతీయ నటులతో పాటు విదేశీ నటులు కూడా భాగం కానున్నారు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. దాదాపుగా వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మించనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయికగా నటిస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.
తాజాగా మరో నటి పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. దర్శకుడు రాజమౌళి ఆమెతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఈ కథలో హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, ప్రియాంక అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని రాజమౌళి భావించినట్టు తెలుస్తున్నది. ప్రియాంక కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు బీటౌన్ టాక్. ఈ పాత్ర కోసం ఆమె ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టిందట.