SRK – Deepika Padukone | బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనే సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. జవాన్, కల్కి చిత్రాల తర్వాత మళ్లీ దీపికా ఏ సినిమాలోను నటించలేదు. గతేడాది తల్లిగా బాధ్యతలు తీసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తుంది.
ఇదిలావుంటే దీపికా మళ్లీ సినిమాలకు ఒకే చెబుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న కింగ్ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు సార్లు షారుక్‌తో జోడి కట్టిన ఈ అమ్మడు తాజాగా మరోసారి సినిమా చేయబోతుంది. దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వైరల్‌గా మారాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
షారుఖ్ ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన దీపికా పదుకొనే ఆ తర్వాత షారుఖ్‌తోనే కలిసి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ‘కింగ్’ వీరిద్దరి కలయికలో వస్తున్న 6వ చిత్రం. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ మరియు జైదీప్ అహ్లావత్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ‘కింగ్’ సినిమా ముంబైలో మే 18 నుండి షూటింగ్ ప్రారంభించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్, సచిన్-జిగర్ సంగీతం అందిస్తున్నారు.