ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కానీ రచ్చ గెలిచి, తర్వాత ఇంటిని కూడా గెలిచి భళా అని పించుకున్న తెలుగు సోయగం శ్రీలీల. తొలుత కన్నడంలో గెలిచి, తర్వాత తెలుగులో నిలిచి.. ఇప్పుడు హిందీ, తమిళం అన్నింటినీ కవర్ చేస్తూ.. జాతీయ స్థాయిలో గుర్తింపుకై ప్రయత్నాలు చేస్తున్నది ఈ అందాలభామ. తాజాగా ఈ తెలుగమ్మాయి డైరీలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చి చేరిందని వినికిడి. కోలీవుడ్ సన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో ఓ సైన్స్‌ఫిక్షన్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలోని ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా శ్రీలీల ఎంపికైందని కోలీవుడ్ న్యూస్. ఇటీవలే శ్రీలీలకు ప్రదీప్ కథ వినిపించాడని, పాత్ర నచ్చడంతో శ్రీలీల పచ్చజెండా ఊపేసిందని తెలిసింది. రీసెంట్గా ‘పరాశక్తి’తో తమిళ ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీలీలకు అక్కడ నిరాశే ఎదురైంది. ఈ సారి పరాజయం ఎరుగని ప్రదీప్ రంగనాథన్‌తో రాబోతున్నది శ్రీలీల. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.