కృత్రిమ మేధని (ఏఐ) ఉపయోగించి సృష్టిస్తున్న అభ్యంతరకరమైన కంటెంట్ పట్ల కథానాయిక శ్రీలీల ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి కంటెంట్, వీడియోలను ప్రోత్సహించవద్దని సోషల్‌మీడియా యూజర్లను కోరింది. ఈ సందర్భంగా బుధవారం ఆమె సోషల్‌మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఏఐ కంటెంట్‌ను అస్సలు ప్రోత్సహించవద్దని సోషల్‌మీడియా వినియోగదారులందరినీ చేతులు జోడించి వేడుకుంటున్నా. సాంకేతికత మన జీవితాలను సరళం చేయాలి. అది మంచి కోసం ఉపయోగపడాలి. కానీ ఇలా ఇతరుల జీవితాలను ఇబ్బందుల్లో నెట్టకూడదు.
కళాత్మక రంగంలో ఉన్న ప్రతీ అమ్మాయి ఒకరికి కూతురు, సోదరి, మనవరాలు, సహోద్యోగి అయి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె కళను వృత్తిగా స్వీకరించి ఉండవచ్చు. ఇండస్ట్రీలో భాగమైనందుకు ఆమెకు రక్షణతో కూడిన వాతావరణం ఉందనే నమ్మకాన్ని కలిగించాలి. నాకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆన్లైన్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు. కానీ కొందరు మిత్రులు ఈ అంశాలను నా దృష్టికి తీసుకొచ్చారు. నా సహ నటీనటులు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం బాధగా ఉంది. ప్రేక్షకులపై మాకు ఎంతో నమ్మకం. అందుకే వారిని మాకు అండగా నిలబడమని అభ్యర్థిస్తున్నా. సంబంధిత అధికారులు ఏఐ అసభ్య కంటెంట్‌పై చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నా’ అని శ్రీలీల తన పోస్ట్‌లో పేర్కొన్నది.