గత ఏడాది కళ్లు మూసుకొని సినిమాలకు సంతకాలు చేసేసినట్టుంది శ్రీలీల. దాదాపుగా నెలకొక సినిమా విడుదలైంది. అయితే, వాటిలో భగవంత్‌కేసరి, గుంటూరుకారం మినహా మిగతా ఏ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు కలిసిరాలేదనే చెప్పాలి. అందుకే ఈ ఏడాది మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నది. అందుతున్న సమాచారం మేరకు ఈ అందాలభామకు అదృష్టదేవత తమిళ్లో తలుపుతట్టిందని తెలుస్తున్నది.
మైత్రీ మూవీమేకర్స్వారు అజిత్ హీరోగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించారని, కథ నచ్చడంతో ఆమె కూడా అంగీకారం తెలిపిందని పేర్కొంటూ తమిళనాట కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదే గనుక నిజమైన శ్రీలీల పంట పండినట్టే. కారణం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. తమిళంలో తొలి అవకాశమే అజిత్ లాంటి సూపర్‌స్టార్‌తో రావడం అంటే చిన్న విషయం కాదు కదా.