అందం, అభినయం కలబోసిన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమాన తారగా ఎదుగుతున్నది శ్రీలీల. టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న ఆమె..ప్రస్తుతం పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఎస్. నాగవంశీ. ఎస్. సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలోని శ్రీలీల పాత్రను చిత్రబృందం శనివారం పరిచయం చేశారు.
ఈ సినిమాలో శ్రీలీల చిత్ర అనే పాత్రలో కనిపించనుంది. చిత్ర సరదాగా ఉంటూ కొంటెపనులు చేస్తుంటుందని, ఎప్పుడూ ఉల్లాసం గా నవ్వుతూ ఉండే అమ్మాయిగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంలో నటించడాన్ని శ్రీలీల బాగా ఆస్వాదిస్తున్నదట. ఆమెకు సంబంధించిన సన్నివేశాలన్నీ సినిమాలో హైలైట్ అవుతాయని చెబుతున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ గ్లింప్స్‌ను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.