Sreeleela | టాలీవుడ్లో అరంగేట్రం చేసిన రెండేళ్ల వ్యవధిలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఎదిగింది అచ్చ తెలుగందం శ్రీలీల. పెద్ద హీరోల చిత్రాల్లో నాయికగా తొలుత ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే మరోవైపు వెండితెరపై రాణిస్తున్నది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని నమ్ముకోవద్దని సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిలో కూడా సక్సెస్ అవుతానని ధీమా వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘డాక్టర్ కావాలన్నది నా చిన్ననాటి కల. ఆ విషయంలో నా పేరెంట్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారు.
ఇక నటిగా ఇంతమంది అభిమానం సొంతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఏదీఏమైనా డాక్టర్ కావడం నా తొలి ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నా. ఆ వృత్తిలో వచ్చే సంతృప్తి వేరు. ప్రతి అమ్మాయి తమ ప్రతిభ మేరకు అభిరుచి ఉన్న రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలి’ అని చెప్పింది. ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’ ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది.