సాధారణంగా సినీరంగంలో విజయాలు లేకపోతే అవకాశాలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ అచ్చతెలుగందం శ్రీలీల విషయంలో ఈ ట్రెండ్ రివర్స్ అవుతున్నది. ఇటీవలకాలంలో ఈ భామ నటించిన సినిమాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయాయి. అయినా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం భారీగానే వస్తున్నాయి. చూడముచ్చటైన అందం, చక్కటి స్క్రీన్‌ప్రజెన్స్, యువతలో తిరుగులేని ఫాలోయింగ్ వంటి కారణాలు సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాల్ని తెచ్చిపెడుతున్నాయని ఇండస్ట్రీ టాక్. తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళంలో ధనుష్ సరసన బంపరాఫర్‌ను దక్కించుకుంది.
ధనుష్ హీరోగా ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీలీలను కథానాయికగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదలైన ‘పరాశక్తి’ చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అయితే ఈ సినిమా పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో శ్రీలీల ఆఫర్‌ను దక్కించుకోవడం విశేషం.