Sree Charani | మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన యువ స్పిన్నర్, తెలుగు కిరీటం శ్రీ చరణి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఈ 21 ఏళ్ల క్రికెటర్ తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో, వ్యక్తిగత ఇష్టాల గురించి చెప్పిన విషయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీ చరణి మాట్లాడుతూ – “నేను సినిమాలు చాలా ఇష్టపడతాను. కానీ ఈ మధ్య బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువగా చూడడం లేదు. గతంలో ప్రభాస్ సినిమా ఏది వచ్చినా వదిలేదాన్ని కాదు. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, సింప్లిసిటీ నన్ను బాగా ఇంప్రెస్ చేస్తాయి” అని చెప్పింది.
ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలవడంలో శ్రీ చరణి పాత్ర కీలకమైంది. మొత్తం 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీ రేటుతో 14 వికెట్లు పడగొట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ యువతి, ప్రతి మ్యాచ్‌లోనూ దూకుడుగా బౌలింగ్ చేసింది.లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసి మ్యాచ్‌ను టీమిండియా వైపు మలిచింది. ఈ ప్రదర్శనతోనే ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ కూడా ఆమెను “ప్రమాదకరమైన బౌలర్” అంటూ ప్రశంసించింది. ఇక తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ – “నేను మంచి ఫుడ్ లవర్. స్వీట్లు తప్ప మిగిలిన అన్నింటినీ ఇష్టంగా తింటాను. అమ్మ చేతి వంట అంటే ప్రాణం. టోర్నీల కారణంగా ఈ మధ్య ఇంటి భోజనం దొరకడం లేదు. నేను బాగా ఆడకపోతే అమ్మ ‘తినకపోవడం వల్లే’ అనుకుంటూ ప్రత్యేకంగా వండి పెడుతుంది” అని నవ్వుతూ చెప్పింది.
“మైదానంలో నేను ఒత్తిడికి గురికాను. ఒక బంతి బాగా వేయకపోతే, తర్వాతి బంతి మెరుగ్గా వేయాలని ప్రయత్నిస్తా. ఎవరి సలహా అయినా శ్రద్ధగా వింటా, ఎందుకంటే వాళ్లు నా మేలు కోరే చెబుతున్నారు” అంటూ శ్రీ చరణి తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది.ప్రస్తుతం భారత మహిళా జట్టులో స్థిరమైన స్థానాన్ని దక్కించుకున్న శ్రీ చరణి భవిష్యత్తు స్టార్‌గా ఎదగనుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.