ముంబై: ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న వెబ్‌సిరీస్ స్క్విడ్ గేమ్( Squid Game ). ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను తెరకెక్కించింది. ఈ సౌత్ కొరియా వెబ్ సిరీస్ ఇప్పటికే హిందీ సహా వివిధ ప్రపంచ భాషల్లోకి డబ్ కావడంతో దీని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నెట్‌ఫ్లిక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోందీ వెబ్ సిరీస్. బ్లూమ్‌బర్గ్ చెప్పిన దాని ప్రకారం.. ఈ షో ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌కు 90 కోట్ల డాలర్ల వరకూ తెచ్చిపెట్టింది. అతి తక్కువ ఖర్చుతో తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ అంచనాలకు ఎన్నో రెట్లు ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంది. 10 ఎపిసోడ్ల ఈ వెబ్‌సిరీస్‌కు అయిన మొత్తం ఖర్చు 2.1 కోట్ల డాలర్లు మాత్రమే.
ప్రపంచవ్యాప్తంగా తొలి 23 రోజుల్లో ఈ షోను కనీసం 2 నిమిషాలు చూసిన వాళ్ల సంఖ్య 13.2 కోట్లు కావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ షోలలో ఇదే రికార్డు. నెట్‌ఫ్లిక్స్ గణాంకాల ప్రకారం.. షోను చూడటం ప్రారంభించిన వాళ్లలో 89 శాతం మంది కనీసం 75 నిమిషాల పాటు చూశారు. తొలి 23 రోజుల్లోనే ఈ షో మొత్తం చూసిన వాళ్లు 66 శాతం. అంటే 8.7 కోట్ల మంది. మొత్తంగా వ్యూయర్స్ ఏకంగా ఈ షో చూడటానికి 140 కోట్ల గంటల సమయం వెచ్చించారు.