Sports Drama | టాలీవుడ్లో సాధారణంగా మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్ తరహా చిత్రాలే హవా కొనసాగిస్తూ ఉంటాయి. కానీ గత కొంతకాలంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాలో న్యాచురల్ ఎమోషన్, నిజమైన త్యాగం ఉంటున్న నేపథ్యంలో ఆ చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మరి కొద్ది రోజులలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో పెద్ది అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ అయితే నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్‌తో అభిమానులు ఉన్నారు. మార్చి 25, 2026న రిలీజ్ కాబోతోంది.
అయితే గతంలో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చి హిట్ అయిన చిత్రాలు చూస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు (బాక్సింగ్ నేపథ్యం) స్పోర్ట్స్ డ్రామాలకు తెరలేపింది. నిర్లక్ష్యంగా ఉండే యువకుడు బాధ్యతగల బాక్సర్‌గా మారే ప్రయాణాన్ని ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించారు. ఇక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాలో తొలిసారి రగ్బీ స్పోర్ట్‌ను తెలుగు తెరపై పరిచయం చేశారు. ఇది స్పోర్ట్స్ చిత్రాలకు ఓ కొత్త కోణాన్ని ఇచ్చింది. నాని ప్రధాన పాత్రలో వచ్చిన జెర్సీ చిత్రం, క్రికెట్ నేపథ్యంతో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ హిందీలోను రీమేక్ అయి పెద్ద విజయం సాధించింది.
ఇక కబడ్డి స్పూర్తితో తెరకెక్కిన సినిమాలు చూస్తే.. ఒక్కడు (మహేష్ బాబు) – కబడ్డీతో పాటు ఎమోషనల్ యాక్షన్ మిక్స్ అయి ఉంటుంది. భీమిలి కబడ్డి జట్టు (నాని) – యూత్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకుంది..సీటిమార్ (గోపీచంద్, తమన్నా) – మహిళా కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రాల వల్ల కబడ్డీ అనే ఆటను పల్లెటూర్ల నుంచి సిటీ థియేటర్ల వరకూ తీసుకువచ్చారు. ఇలా స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదిస్తున్నాయి. క్రీడా నేపథ్యంలో వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘జెర్సీ’, ‘సీటిమార్’ వంటి సినిమాల తర్వాత, ఇప్పుడు పెద్ది లాంటి క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా హిట్ అయితే రానున్న రోజులలో మరిన్ని స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు రావడం ఖాయం.